: సహజీవనానికి అడ్డొస్తున్నాడని యువతి అన్నను కాల్చి చంపిన యువకుడు
తమ సహజీవనానికి అడ్డొస్తున్నాడని దేశరాజధాని ఢిల్లీలో తాను ప్రేమిస్తోన్న యువతి అన్నను హత్య చేశాడో యువకుడు. అక్కడి విజయ్ విహార్ లో నివాసం ఉంటోన్న ఓ యువతిని ఆ ప్రాంతంలోనే నివసించే ఓ యువకుడు ప్రేమించాడు. యువతి వెంట పడిన ఆ యువకుడు ఓ రోజు ఆమెను కిడ్నాప్ చేసి ఆ యువతితో సహజీవనం కొనసాగించాడు. యువకుడి బారినుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోయి ఆ యువతి నాలుగురోజుల క్రితం ఇంటికి వచ్చింది. అయినా యువతిని తన సొంతం చేసుకోవాలనుకున్న యువకుడు ఓ తుపాకితో ఆమె ఇంటికి వచ్చి యువతి అన్నతో గొడవపెట్టుకున్నాడు. యువతితో సహజీవనం కొనసాగిస్తానని వాదించాడు. దానికి ఆ యువతి సోదరుడు అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న తుపాకీతో అతనిని కాల్చేశాడు. కాల్పులతో తీవ్రంగా గాయపడిన యువతి సోదరుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అతను మరణించాడని వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన యువకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.