: బ్యాంకు ఉద్యోగినిపై వైద్యుడి వేధింపులు!... వెంటపడి పట్టుకున్న ‘షీ టీమ్స్’!


అతడో వైద్యుడు. అనారోగ్యంతో తన వద్దకు వచ్చేవారికి చికిత్స చేసి రోగం నుంచి ఉపశమనం కల్పించాల్సిన అతడు దారి తప్పాడు. వక్రమార్గంలో పయనించాడు. చికిత్స కోసం వచ్చిన ఓ బ్యాంకు ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు దిగాడు. బాధితురాలు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించాడు. అయితే బాధితురాలి నుంచి ఫిర్యాదునందుకున్న ‘షీ టీమ్స్’ ఆ వైద్యుడిని వెంటాడి మరీ పట్టుకున్నారు. హైదరాబాదు శివారులోని శంషాబాదులో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... సరూర్ నగర్ లో వైద్యుడిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు తన వద్దకు చికిత్స నిమిత్తం వచ్చిన విజయా బ్యాంకు ఉద్యోగిపై కన్నేశాడు. ఈ క్రమంలో అతడి నుంచి వేధింపులు పెరగడంతో బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ‘షీ టీమ్స్’ను చూసిన నాగేశ్వరరావు పరారయ్యాడు. బాధితురాలి బంధువులతో కలిసి అతడిని వెంబడించిన షీ టీమ్స్ పోలీసులు శంషాబాదు సమీపంలో అతడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రహావేశాలకు గురైన బాధితురాలి బంధువులు నాగేశ్వరరావుకు బడితె పూజ చేశారు. ఆ తర్వాత అతడిని శంషాబాదు పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News