: తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడదే, ఆయనే రెచ్చగొట్టారు!: స్పష్టం చేసిన సీఐడీ
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల పోరాటంలో ఆ వర్గం నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన సభలో ఆందోళనకారులు రెచ్చిపోయి రైలుని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సీఐడీ ఈరోజు తుని కేసు రిమాండ్ రిపోర్టును మీడియా ముందుంచింది. తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడదే అని సీఐడీ పేర్కొంది. కాపులు నిర్వహించిన సభలో ఆ వర్గం కార్యకర్తలు రెచ్చిపోవడంతో రత్నాచల్ రైలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగాయని, ఈ విధ్వంసానికి కార్యకర్తల్ని ముద్రగడే ప్రేరేపించారని నివేదికలో సీఐడీ పేర్కొంది. ముద్రగడ వ్యాఖ్యలతో ఆందోళనకారులు రెచ్చిపోయారని తెలిపింది. కొందరు ఆందోళనకారులు కుట్ర పూరితంగా సభకు వచ్చారని.. తమతో ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వకంగానే తెచ్చుకున్నారని సీఐడీ పేర్కొంది.