: అమరావతిలో న్యూక్లియర్ సిటీ!... హైడ్రోజన్ బాంబుల తయారీ!: పాక్ మీడియా వింత కథనాలు
నవ్యాంధ్రలోని గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నూతన రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నూతన రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేయించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అక్కడి వెలగపూడి పరిధిలో తాత్కాలిక రాజధానిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 లోగా తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కానున్నాయి. ఇక సచివాలయానికి ఉద్యోగులు వచ్చి వెళ్లేందుకు అక్కడ రహదారులు కూడా ఏర్పాటవుతున్నాయి. వెరసి ఓ రాష్ట్ర పాలనకు సంబంధించిన కేంద్రం అక్కడ రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ పనులపై పాక్ మీడియా ఓ వింత కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నెల 3న పాక్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ పెద్ద మనిషి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని ఆ పెద్ద మనిషి తేల్చేశారు. అమరావతి డిజైన్ లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెలలోనూ ఆ దేశ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. ఇక మీడియాకు వంత పాడిన పాక్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా అమరావతిలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది.