: భారత విద్యార్థులకు అమెరికా వర్సిటీ షాక్!... తక్షణమే వర్సిటీ వదిలి వెళ్లాలని హుకుం!
అగ్రరాజ్యం అమెరికాలో భారత విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇటీవలే ఆ దేశంలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన పదుల సంఖ్యలో తెలుగు విద్యార్థులను ఆ దేశ అధికారులు ఎయిర్ పోర్టుల్లోనే అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేవంటూ తిరుగు విమానంలో ఎక్కించేశారు. తాజాగా అన్ని అర్హతలతో అక్కడి వర్సిటీలో చేరి ఓ సెమిస్టర్ కూడా పూర్తి చేసుకున్న భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఘటన అమెరికాలోని వెస్ట్రన్ కెంటరీ వర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... ఇంటర్నేషనల్ రిక్రూటర్లతో కంప్యూటర్ సైన్స్ లో విద్యనభ్యసించేందుకు వెస్ట్రన్ కెంటరీ వర్సిటీ 60 మంది భారత విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. వర్సిటీ ప్రవేశాలు లభించడంతో తెలుగు విద్యార్థులంతా హుషారుగా అక్కడికి వెళ్లిపోయారు. ఇప్పటికే ఓ సెమిస్టర్ కూడా పూర్తైంది. సెమిస్టర్ పరీక్షల్లో 25 మంది విద్యార్థులు వర్సిటీ ప్రమాణాల మేరకు ఫలితాలు సాధించలేకపోయారట. దీంతో వారికి నిన్న నోటీసులు జారీ చేసిన వర్సిటీ తక్షణమే వర్సిటీ వదిలివెళ్లిపోవాలని తెలిపింది. కోర్సులో ప్రధాన సబ్జెక్ట్ అయిన కంప్యూటర్ సైన్స్ లోనే ఆ విద్యార్థులు వర్సిటీ ప్రమాణాలను అందుకోలేకపోయారని ఆ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ఓ సెమిస్టర్ పూర్తి అయ్యేంతవరకు అన్నీ సవ్యంగా ఉండగా, తాజాగా వచ్చిన ఇబ్బందేమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నపళంగా దేశం విడిచివెళ్లాలని అమెరికా వర్సిటీ చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో భారత విద్యార్థులు అయోమయంలో పడ్డారు.