: జవహర్ బాగ్ లో అమెరికా రాకెట్ లాంచర్!... కలకలం రేపుతున్న మధుర అల్లర్ల కేసు!
ఉత్తరప్రదేశ్ లోని మధురలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన దర్యాప్తులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నగరం నడిబొడ్డున 280 ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన 'స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రాహి' సంస్థ... అందులో ఆయుధాల తయారీతో పాటు తన కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇచ్చిందని తేలిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై 40 సార్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినా అఖిలేశ్ సర్కారు స్పందించని వైనం కూడా కలకలం రేపుతోంది. తాజాగా సదరు సంస్థ ఆక్రమించిన జవహర్ బాగ్ లో సోదాలు చేస్తున్న బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కు అమెరికాలో తయారైన ఓ రాకెట్ లాంచర్ దొరికింది. ఈ అత్యాధునిక యుద్ధ పరికరాన్ని ఈ సంస్థకు ఎవరు సరఫరా చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విచారణలో మరింత సంచలనం రేకెత్తించే అంశాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదు.