: ఢిల్లీపై గురిపెట్టిన దావూద్ ఇబ్రహీం!... భీకర దాడులకు రంగంలోకి దిగిన 'డీ' కంపెనీ!
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించిన అండర్ వరల్డ్ డాన్, భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నగరం కరాచీలో నిక్షేపంగానే ఉన్నాడు. అక్కడి పోలీసుల నిఘాలో స్వేచ్ఛగా సంచరిస్తున్న దావూద్... భారత్ ను అస్థిరపరిచే కుట్రలకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు రచిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు తన సన్నిహితులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ను సేకరించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో భీకర దాడులకు అతడు పన్నాగం పన్నాడని ఐబీ తన నివేదికలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇందులో భాగంగా ఇప్పటికే తన డీ కంపెనీలోని పలువురు వ్యక్తులను దావూద్ రంగంలోకి దింపాడని కూడా ఆ కథనం పేర్కొంది. ఐబీ నివేదిక నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎయిర్ పోర్టు, మెట్రో, విధాన్ సభ, ఢిల్లీ రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.