: పొలిటికల్ ప్రెజర్ తెచ్చిన సర్కారీ వైద్యులు!.. డిసిప్లినరీ యాక్షన్ తో షాకిచ్చిన పూనం!


నవ్యాంధ్ర పాలనలో నిన్న ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని ఏమాత్రం సహించని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తీరు ఇతర అధికారులకు కాస్తంత భిన్నంగానే ఉంటుంది. మెజారిటీ అధికారులు అసలు పనిని పక్కనబెట్టి సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తున్న వైనం మనకు తెలిసిందే. అయితే పూనం వద్ద మాత్రం ఆ పప్పులు ఉడకవు. పనిని తప్ప ఆమె దేనిని కూడా లెక్కచేయరు. ఇక ప్రభుత్వ వైద్యులది మరో రకమైన వ్యవహారం. సర్కారీ ఆసుపత్రిలో ఉద్యోగం వెలగబెడుతూనే ప్రైవేట్ క్లినిక్ లను ఏర్పాటు చేసుకుంటూ తమదైన శైలిలో రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో సర్కారీ ఉద్యోగం కంటే తమ సొంత ఆసుపత్రుల్లో విధులకే ప్రాధాన్యమిస్తారు. ఇలా ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసిన పలువురు వైద్యులను గుర్తించిన ఏపి ప్రభుత్వం... వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు... వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్యను తమ దారికి తెచ్చుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆమెపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో భగ్గుమన్న పూనం... తనపై రాజకీయ ఒత్తిడులకు యత్నించిన 43 మంది వైద్యులకు నోటీసులకు బదులు క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటూ నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. నోటీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన తమపై క్రమశిక్షణా చర్యలకు ఉత్తర్వులు జారీ కావడంతో వైద్యులు షాక్ తిన్నారు.

  • Loading...

More Telugu News