: కోహ్లీపై ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల జల్లు
అద్భుత ఫాంతో చెలరేగి ఆడుతోన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని ఎంతో మంది క్రికెటర్లు గొప్పగా పొగిడేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ కూడా చేరారు. కోల్‌కతాలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన మురళీధరన్ మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్‌ని కట్టడి చేయడం ఏ బౌలర్ వల్లా కాదని అన్నారు. మున్ముందు కూడా చాలాకాలం వరకు కోహ్లీ ఇదే రకమైన ఆటతీరుతో అభిమానులను అలరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ తనదైన శైలిలో రాణిస్తున్నాడని, ఆయనను నియంత్రించడం కష్టమైన పనేనని మురళీధరన్ అన్నారు. విరాట్ కోహ్లీ భవిష్యత్తులో చాలా కాలం ఇదే ఆటతీరును కనబర్చి రికార్డుల మోత మోగించాలని ఆయన ఆశించారు. కోహ్లీ ప్రపంచ మేటి ఆటగాడని ఆయన ప్రశంసించారు.