: ఏకంగా గవర్నర్ భార్య కారునే వెంబడించారు... పోలీసుల చేతికి చిక్కారు!
రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ భార్య ప్రయాణిస్తోన్న కారునే వెంబడించి పలువురు దుండగులు దోపిడీకి యత్నించిన ఘటన గువాహటికి దగ్గరలోని సోనాపూర్ లో చోటు చేసుకుంది. ఆపదను గమనించిన ఆమె తన భర్త, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాకు సమాచారం అందించడంతో దోపిడీ దొంగల బారినుంచి తప్పించుకున్నారు. గవర్నర్ భార్య రీటా రాజ్‌ఖోవా అసోంలోని గువాహటి నుంచి ఇటానగర్ కి తన కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సోనాపూర్ వద్ద రీటా రాజ్‌ఖోవా కారుని ఫాలో అయిన పలువురు దుండగులు ఆ కారును ఆపాలని కోరారు. కారు ఆపాలని కోరుతున్నవారు కొత్త వ్యక్తుల్లా కనిపించడంతో ఆమె అలర్ట్ అయ్యారు. కారు ఆపలేదు సరికదా కారుని మరింత వేగంగా పోనివ్వాలని తన డ్రైవర్‌కి సూచించారు. దుండగులు ఆమె కారును కొంత దూరం వరకు వెంబడించారు. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా ఈ విషయాన్ని అసోం, అరుణాచల్‌ప్రదేశ్ డీజీపీలకి చెప్పారు. వెంటనే పోలీసులు నిమిషాల్లో అక్కడి ప్రాంతానికి చేరుకొని దోపిడీదారుల నుంచి రీటాను కాపాడారు. ఆమెను రాజ్‌భవన్‌కు తరలించారు. గవర్నర్ భార్యను వెంబడించిన నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. నిందితులు అసోం, ఉత్తర్‌ప్రదేశ్ వాసులని పోలీసులు తెలిపారు.