: జీన్స్ వద్దంటే లుంగీలు కడతాం!... కేరళ కాలేజీ అమ్మాయిల ఫొటోలు వైరల్!


విద్యాధికుల రాష్ట్రంగా పేరుగాంచిన కేరళలోనూ అమ్మాయిల వస్త్రధారణపై ఆంక్షలు కొనసాగుతున్నాయా?... ఈ వార్త వింటే నిజమేనని నమ్మక తప్పదు. ఆ రాష్ట్రంలోని ఓ కళాశాలకు చెందిన కొంతమంది అమ్మాయిలు లుంగీలు కట్టి, మగాళ్లలా మోకాళ్లపైకి లుంగీని మడిచి కట్టి వరుసగా నిలబడ్డ పోజులో ఓ ఫొటో, దానికి కొనసాగింపుగా ‘శ్రీమంతుడు’ చిత్రంలో ప్రిన్స్ మహేశ్ బాబు లుంగీ కట్టి వీధుల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరహాలో మరో ఫొటో ప్రస్తుతం ఫేస్ బుక్ లో వైరల్ గా మారాయి. ఓ కళాశాల జీన్స్ ప్యాంట్లను నిషేధించగా, అందుకు నిరసనగా అమ్మాయిలు లుంగీలు కట్టారంటూ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భావ్నానీ, టీవీ నటి అర్చనా విజయ సదరు ఫొటోలకు కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా... ఈ ఫొటోలు నిరసన తెలిపేందుకు తీసినవి కావన్న మరో వాదన వినిపిస్తోంది. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని అనుకరించిన కాలేజీ అమ్మాయిలు లుంగీలు కట్టి సరదాగా ఈ ఫొటో తీసుకున్నారని ఓ వాదన ఉంది. అయితే మరో వాదన ప్రకారం... గతేడాది మలయాళీ పండుగ ‘ఓనం’ను పురస్కరించుకుని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి చెందిన అమ్మాయిలు లుంగీలు కట్టి డ్యాన్స్ చేసేముందు ఫొటో తీసుకున్నారట. ఏదైతేనేం, లుంగీలు కట్టి మగరాయుళ్లలా ఠీవీ ఒలకబోస్తూ సదరు అమ్మాయిలు నిల్చున్న తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News