: ‘శ్రీమంతుడు’ సినిమా టికెట్ కోసం రూ.1,200 ఖర్చు పెట్టిన చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా నవ్యాంధ్ర పాలనలోనే నిమగ్నమవుతున్న చంద్రబాబుకు సినిమా చూసేంత తీరిక కూడా దొరికిందా? అంటే... కేవలం సినిమా చూడటానికే ఆయన వెళ్లలేదులెండి. వివరాల్లోకెళితే... విజయవాడ బస్టాండ్ లో ‘వై స్క్రీన్’ సంస్థ సరికొత్త తరహాలో సినిమా థియేటర్ ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్ లో తొలి థియేటర్ గా రికార్డులకు ఎక్కిన సదరు థియేటర్ ను చంద్రబాబు నిన్న ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన రూ.1,200 పెట్టి టికెట్లు కొన్నారు. తనతో పాటు అక్కడికి వచ్చిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, అధికారులతో కలిసి ధియేటర్ లో అడుగుపెట్టిన ఆయన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చూశారు. సినిమాను సాంతం చూడని చంద్రబాబు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండి... ఆ తర్వాత అమరావతికి వెళ్లిపోయారు. థియేటర్ లో తొలి టికెట్ కొన్నందునే చంద్రబాబు రూ.1,200 ఖర్చు చేసినట్లు సమాచారం.