: స్విట్జర్లాండ్ పర్యటనలో సానియా మీర్జాను తలచుకున్న నరేంద్ర మోదీ... ఏం చెప్పారంటే...!
తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా నిన్నంతా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో బిజీగా గడిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి నుంచి వెళుతూ వెళుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తలచుకున్నారు. ఇరుదేశాల మధ్యా ఉన్న ద్వైపాక్షిక బంధం గురించి, తన పర్యటన గురించి మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ, ఆర్థికాంశాలను, ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని ప్రస్తావిస్తూ సానియా గురించి రెండు మాటలు చెప్పారు. భారత టెన్నిస్ క్రీడాకారులైన సానియామీర్జా, లియాండర్ పేస్ లు స్విస్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్ తో కలసి ఎన్నో గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకుని ఇరు దేశాల మధ్యా బంధాన్ని మరింతగా పెంచారని గుర్తు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ లోని ఎన్నో ప్రాంతాల్లో వివిధ భారతీయ భాషలకు చెందిన సినిమాలను చిత్రీకరించారని ఆయన తెలిపారు.