: హైదరాబాద్ లో రాత్రంతా వర్షం... నీట మునిగిన పలు ప్రాంతాలు
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో గత రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, కార్వాన్ తదితర ప్రాంతాలతో పాటు రామాంతపూర్, ఉప్పల్ పరిధిలోని కాలనీల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. కూకట్ పల్లి, మాదాపూర్, ఖైరతాబాద్, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలీ, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్ లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై నీరు నిలవడంతో ఈ ఉదయం తమతమ వాహనాలతో బయటకు వచ్చిన వారు అవస్థలు పడ్డారు. మరోవైపు నల్గొండ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.