: రెండు వర్గాలుగా చీలిన ఏపీ సచివాలయ ఉద్యోగులు!


ఏపీ సచివాలయ ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. నిర్ణీత సమయానికల్లా అమరావతికి తరలి రావాలని సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ, తాము అమరావతికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందని ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో మరి కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ... తాము అమరావతికి వెళ్లేది లేదని కరాఖండీగా చెబుతూ, అక్కడ ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని, పెద్దఎత్తున ఉద్యోగులు తరలి వస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో అమరావతి పరిసరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో వీరు, తామూ మనుషులమే, తమకు కూడా కుటుంబాలు ఉన్నాయంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌన ప్రదర్శన చేశారు. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. ఉద్యోగులు మౌన ప్రదర్శన చేస్తూ, మీడియాను ఆకర్షించడంతో ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు కారణం రాజకీయ నాయకుల వ్యాఖ్యలేనని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా తాము ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదని, కేవలం ఓ ఐదు నుంచి పది శాతం మంది ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తామంతా అమరావతికి తరలేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. అందులో ఎలాంటి అనుమానాలు వద్దని, అయితే ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ, రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News