: ఒక్కసారిగా వెల్లువెత్తిన అమ్మకాలతో స్టాక్ మార్కెట్ కు నష్టం


గడచిన కొన్ని సెషన్లుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్న వేళ, ఒక్కసారిగా వచ్చిన అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే లాభాల్లో ఉన్నప్పటికీ, ఆపై ఒత్తిడి మధ్య ఒడిదుడుకులకు లోనైంది. మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో 26,823 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, 2.29 గంటలకు 26,752 పాయింట్లకు జారింది. ఐదు నిమిషాల వ్యవధిలో 70 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్, ఆపై మార్కెట్ సెషన్ పూర్తయ్యేవరకూ కోలుకోలేదు. ఇన్వెస్టర్ల సంపద రూ. 17 వేల కోట్లకు పైగా తగ్గింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 65.58 పాయింట్లు పడిపోయి 0.24 శాతం నష్టంతో 26,777.45 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 19.75 పాయింట్లు తగ్గి 0.24 శాతం నష్టంతో 8,201.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.09 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.22 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, భారతీ ఎయిర్ టెల్, లుపిన్, ఇన్ ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,771 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,178 కంపెనీలు లాభాలను, 1,460 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతంలో రూ. 99,88,268 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 99,71,664 కోట్లకు తగ్గింది.

  • Loading...

More Telugu News