: ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం లేదు: వైసీపీ నేత రోజా
‘నా నియోజక వర్గంలో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైనా నాకే ఆహ్వానం పంపలేదు’ అని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలో తిరుపతిలోని విజయపురంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమం అయిన నవనిర్మాణదీక్షకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, అవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని విమర్శించారు. గతంలో ఒక్క హైదరాబాద్ పైనే చంద్రబాబు దృష్టి పెట్టారని, ఇప్పుడేమో అమరావతి నామస్మరణ చేస్తున్నారని... అధికార వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమని రోజా అన్నారు. గడచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించింది ఏమీలేదని ఆమె విమర్శించారు.