: జగన్ సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: ఆనం రామనారాయణ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం రామనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డుతగులుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ హుందాగా వ్యవహరించడం లేదని విమర్శించారు. వైసీపీ అధినేత కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే అనంతపురంలో పర్యటనలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌కి అధికారం మాత్రమే కావాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదని ఆనం రామనారాయణ అన్నారు. యాత్ర పేరుతో సీఎంపై వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని, అభివృద్ధికి జగన్ ఎక్కడికక్కడ అడ్డుతగులుతున్నారని ఆయన అన్నారు. జగన్ సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను జీర్ణించుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని ఆయన అన్నారు.