: బాబు సర్కారుకు ఆగస్టు వరకూ డెడ్ లైన్ పెట్టిన ముద్రగడ
కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు ఆగస్టు నెలాఖరు వరకూ డెడ్ లైన్ విధిస్తున్నట్టు ముద్రగడ పద్మనాభం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన కాపునాడు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఆగస్టులోగా కాపులను బీసీల్లో చేర్చకుంటే, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 నాటికి జిల్లాల వారీగా కాపుల జనాభా లెక్కలు తేల్చాలని ఆయన చంద్రబాబు సర్కారును డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని కొందరు పదవుల కోసం ఉద్యమంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. ఉద్యమిస్తున్న తమను విమర్శించడం మానేసి కాపులకు ఎలా న్యాయం చేయాలన్న విషయాన్ని ఆలోచించాలని వారికి హితవు పలికారు.