: మీ మాటలపై నమ్మకం లేదు: చంద్రబాబు సర్కారుపై అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా నేటి ఉదయం విజయవాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు సహా మంత్రులు చేస్తున్న ప్రకటనలపై తమకు నమ్మకం లేదని అశోక్ బాబు నిరసన గళం విప్పారు. ఈ నెల 27 నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తవుతుందన్న నమ్మకం తమకు లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వినిపిస్తున్న ప్రకటనలతో ఉద్యోగుల్లో అపనమ్మకం పెరిగిందన్నారు. అయినా వసతులు లేకుండా అమరావతికి వచ్చి తామేం చేస్తామని ఆయన వితండ వాదన చేశారు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టతే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాత్కాలిక సచివాలయంలో తమకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటైన తర్వాతే తాము హైదరాబాదు నుంచి తరలివస్తామని ఆయన పేర్కొన్నారు.