: మద్యం, పేకాట... ఈ రెండింటితో ఇల్లు గుల్లేనని హెచ్చరించిన చంద్రబాబు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... చెడు అలవాట్లకు ఆమడ దూరంలో ఉంటారు. అయితే ఆయన నోట నిన్న మద్యం, పేకాట మాటలు వినిపించాయి. ఈ రెండు చెడు అలవాట్ల కారణంగా జరిగే నష్టాలను ప్రజలకు వివరించేందుకే చంద్రబాబు నోట ఈ రెండు మాటలు వినిపించాయి. కాస్తంత హాస్య రసాన్ని పండించి నవ్వులు పూయించిన చంద్రబాబు.. వాటి వల్ల కలిగే నష్టాలపై డేంజర్ బెల్స్ మోగించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన సందర్భంగా చంద్రబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘కొంతమందికి సినిమాలు చూస్తే ఆనందం కలుగుతుంది. కొంతమందికి పేకాట ఆడితే బాగుంటుంది. కానీ అది చాలా డేంజర్. మరికొందరికి సాయంత్రమైతే బ్రాందీ షాపునకు వెళితే ఆనందం. కానీ ఆరోగ్యం పోతుంది. కొన్ని దేశాల్లో ఒక్క పెగ్ తో ఆగిపోతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ మనవాళ్లు శారీరక కష్టం చేసినప్పుడు పెగ్గుతో మొదలుపెట్టి ఫుల్ బాటిల్ వేసుకునే వరకు వస్తున్నారు. మద్యానికి బానిసలవుతున్నారు. అక్కడే సమస్యలు వస్తున్నాయి. పేకాటతో డబ్బులు పోతాయి. మద్యంతో ఆరోగ్యం పోతుంది. వాటితో జాగ్రత్త’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News