: డైరెక్ట్ చేసినప్పుడు అన్నింట్లోనూ వేలుపెట్టొచ్చు: ప్రభుదేవా
ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పుడు అన్నింట్లో వేలు పెట్టొచ్చుకానీ, ఆ చిత్రంలో హీరోగా చేస్తే కేవలం ఆ ఒక్క పనే చూసుకోవాలి, నిర్మాతగా ఉంటే నిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా ఉంటే కొరియోగ్రాఫర్ గానే ఉండాలని ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం ఫలానా హీరో బాగా డ్యాన్స్ చేసేవాడని అనుకునేవారు. కానీ, ఇప్పుడలా లేదని, చాలా మంది హీరోలు బాగానే చేస్తున్నారని చెప్పారు. హీరో, హీరోయిన్లలో హీరోలే బాగా డ్యాన్స్ మూమెంట్స్ ఉండేలా చూసుకుంటారని, హీరోయిన్లకు కూడా డ్యాన్స్ అవకాశం కల్పిస్తే అప్పుడు వారి టాలెంట్ కూడా బయటపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కొరియోగ్రాఫర్ గా ఉన్న నాటి తెలుగు చిత్రాలకు సంబంధించి మాట్లాడుతూ, రాధ, రాధిక, విజయశాంతి డ్యాన్స్ బాగా చేసేవారని చెప్పాడు. తాను నటించిన చిత్రాల్లో తనతో హీరోయిన్లుగా నటించిన నగ్మా, రోజా, మీనాలలో ఎవరు బాగా డ్యాన్స్ చేసేవారని ప్రశ్నించగా, ‘వీళ్లు బెస్ట్, వాళ్లు బెస్ట్ అని ఒకరి పేరు నేను చెప్పకూడదు’ అంటూ నవ్వుతూ తప్పించుకున్నాడు.