: తుంగభద్రకు పోటెత్తిన వరదనీరు... నిండుకుండలా ఆర్డీఎస్
కర్ణాటకలో కురిసిన వర్షాలకు తుంగభద్రా నదికి వరదనీరు పోటెత్తుతోంది. నిన్నటివరకూ చుక్క నీరు లేక ఎడారిని తలపించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఇప్పుడు జలకళతో నిలిచింది. తుంగభద్రకు వస్తున్న నీరు కృష్ణా నదిలోకి చేరుతూ, శ్రీశైలం వైపు పరుగులు తీస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు కొరత తీరనుందని తెలిపారు. నదిలోకి 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. నేడు, రేపు కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ఈ సీజనులో ముందుగా అనుకున్న దానికన్నా త్వరితగతిన కృష్ణానదిపై డ్యాములు నిండుతాయని అంచనా.