: ఈ సినిమా విజయవంతమవ్వడానికి కారణం నలుగురు వ్యక్తులు: నితిన్
'అ ఆ' సినిమా విజయవంతమవ్వడానికి కారణం నలుగురు వ్యక్తులని నితిన్ చెప్పాడు. విజయోత్సవ సభలో నితిన్ మాట్లాడుతూ, వారిలో మొదటి వ్యక్తి అద్భుతమైన కథను రాసిన త్రివిక్రమ్ అని అన్నాడు. రెండో వ్యక్తి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సరళంగా, సూటిగా సంభాషణలు రాసిన 'త్రివిక్రమ్' అని చెప్పాడు. ఇక మూడో వ్యక్తి కథ, సంభాషణలను అద్భుతంగా తీర్చిదిద్దిన 'త్రివిక్రమ్' అని చమత్కరించాడు. ఇక నాలుగో వ్యక్తి ఈ సినీ నిర్మాత చినబాబు అని చెప్పాడు. ఇలాంటి కథను విని నమ్మకంతో బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుచేసి, అద్భుతమైన విజయానికి కారణమయ్యారని తెలిపాడు. ఇక సినిమా ప్రారంభంలో 'అ ఆ' వల్ల హీరో హీరోయిన్లకే కాకుండా మరో పది మందికి పేరువస్తుందని త్రివిక్రమ్ తనకు చెప్పారని, ఆయన చెప్పినట్టే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు అందుతున్నాయని తెలిపాడు. ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.