: సమంత ఇచ్చిన సలహాతో మనసుతో ఈ సినిమా చేశాను: త్రివిక్రమ్
'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో 'సుబ్బలక్ష్మి' పాటను షూట్ చేస్తున్నప్పుడు సమంత తనతో మాట్లాడుతూ, 'మీరు సినిమాల్లో మెదడు ఎందుకు వాడతారు? మనసు ఎందుకు వాడరు?' అని సలహా ఇస్తూ, ప్రశ్నించిందని త్రివిక్రమ్ తెలిపారు. 'అ ఆ' సినిమా విజయోత్సవ సభలో త్రివిక్రమ్ మాట్లాడుతూ, 'నిజానికి మేము మీ మేధస్సు కంటే మీ మనసునే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి మనసును ఎందుకు వాడరు, ఓ సారి దానిని కూడా వాడండి' అని చెప్పిందని అన్నారు. అందుకే ఈ సినిమాను 'మనసు'తో తీశానని త్రివిక్రమ్ తెలిపారు. అందువల్లేనేమో ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బద్దకం ఆవహించి తాను ఖాళీగా ఉన్నప్పుడు ఈ సినిమా చేయవలసి వస్తే, తనకోసం నితిన్ ఖాళీ చేసుకున్నాడని, తమ కోసం సమంత ఖాళీ చేసుకుని డేట్స్ ఇచ్చిందని త్రివిక్రమ్ చమత్కరించారు. ఈ సినిమాలో అంతా బాగా నటించారని కితాబునిచ్చారు. ఈ సినిమా ఓ 15 మంది బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తులు పడ్డ కష్టానికి లభించిన విజయమని ఆయన చెప్పారు. 'నీకు నచ్చినట్టు సినిమా తియ్' అని తనకు అండగా నిలిచిన నిర్మాత చినబాబుకి ధన్యవాదాలు చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, దీనిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, దీనిని ప్రోత్సహించిన మీడియాకు త్రివిక్రమ్ థ్యాంక్స్ చెప్పారు.