: సాయంత్రం దాకా కోర్టులోనే విజయసాయిరెడ్డి!... రాజ్యసభ ధ్రువీకరణ పత్రం అందని వైనం!


వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి నిన్న పట్ట పగలే చుక్కలు కనిపించాయి. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఏకగ్రీవంగానే పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఏపీ కోటాలోని నాలుగు సీట్లకు కేవలం నాలుగు నామినేషన్లే దాఖలైన నేపథ్యంలో టీడీపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి సురేశ్ ప్రభులతో పాటు వైసీపీ తరఫున బరిలోకి దిగిన సాయిరెడ్డి... ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి హోదాలోని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. ఈ క్రమంలో రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను తీసుకునేందుకు నలుగురు నేతలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న సాయిరెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సమాచారం అందుకున్న సాయిరెడ్డి పరుగు పరుగున కోర్టుకెళ్లక తప్పలేదు. ఇటీవలే ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని, ఆ కారణంగానే విచారణకు హాజరుకాలేకపోయానని, తనను మన్నించాలని ఆయన కోర్టును వేడుకున్నారు. అయితే సాయిరెడ్డి వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి... నామినేషన్ల దాఖలుకు వెళుతున్నారుగా, కోర్టుకు రావడానికి వచ్చిన ఇబ్బందేమిటని కాస్తంత కటువుగానే ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణను సాయంత్రం దాకా వాయిదా వేసింది. ఈ క్రమంలో పిటిషన్ ను కోర్టు స్వీకరించి, తన నిర్ణయం వెలువరించేదాకా సాయిరెడ్డి కోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సాయంత్రం కోర్టు వేళలు ముగిసే సమయంలో సదరు పిటిషన్ ను స్వీకరించిన కోర్టు... సాయిరెడ్డిపై జారీ చేసిన వారెంట్లను ఉపసంహరించుకుంది. దీంతో బతుకు జీవుడా అంటూ సాయిరెడ్డి కోర్టు నుంచి బయటకు వచ్చారు. అయితే కేవలం రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేందుకే ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు... సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లతో కలిసి అసెంబ్లీకి వెళ్లి తమ పత్రాలను తీసుకున్నారు. మంచి ముహూర్తంలో (సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య) ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలని భావించిన సాయిరెడ్డి మాత్రం కోర్టులో ఉన్న కారణంగా ఆ పత్రాన్ని అందుకోలేకపోయారు. ఈ నెల 6న సాయిరెడ్డి తన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు.

  • Loading...

More Telugu News