: వృద్ధుడుని ప్రేమ వివాహం చేసుకున్న యువతి... బెంగళూరులో కలకలం రేపిన వివాహం!
ప్రేమ వివాహాలు సాధారణమే. అయితే, తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ప్రేమ వివాహం మాత్రం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన హసన్ముఖ హెచ్.ప్రజాపతి కుమార్తె కృపా హెచ్.ప్రజాపతి (27) హెణ్ణూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ సెంటర్ (ఎన్ఐసీసీ) లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు విద్యనభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకాష్ కుమార్ (64)తో ప్రేమలో పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. తండ్రి వయసు ఉన్నవాడితో ప్రేమేంటని ప్రశ్నించారు. ఇక తన కుటుంబ సభ్యులు ప్రేమను అంగీకరించరని గుర్తించిన ఆమె, నెల క్రితం ఎవరికీ తెలియకుండా రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయనను వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి తల్లిదండ్రులతో మాట్లాడడం, ఇంటికి వెళ్లడం మానేసింది. వారి వివాహ విషయం ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ఆ దంపతులు రిజిస్ట్రార్ ఆఫీసుకు వస్తున్నారని తెలుసుకుని బంధువులతో అక్కడికి చేరుకున్నారు. వారు ఊహించినట్టే ఆకాష్, కృపా దంపతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం పట్టలేకపోయారు. ఆకాశ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమాయకులైన యువతులకు డబ్బు ఆశ చూపి, వారిని వివాహం చేసుకుని, తరువాత విడాకులు తీసుకోవడం మామూలేనని వారు ఆరోపించారు. అయితే కృపా మాత్రం, చిన్ననాటి నుంచి తన కుటుంబ సభ్యులు తన పట్ల వివక్ష చూపించారని, అందుకే ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలిపింది.