: మధుర ఘటనలో తప్పు పోలీసులదే: తేల్చిన అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లోని మధురపార్కులో చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటన చేశారు. మధురలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో తప్పు పోలీసులదేనని అన్నారు. ఆందోళనకారుల ఆగ్రహంపై సమాచారమున్న పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, పార్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయన్న విషయం కనుక్కోలేకపోయారని ఆయన చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై యూపీ పోలీస్ హెడ్ జావెద్ మాట్లాడుతూ, పార్కులో ఆందోళనకారుల వద్ద ఆయుధాలు ఉన్నట్టు సమాచారం ఉందని, అయితే కాల్పులు జరుపుతారని తాము ఊహించలేదని అన్నారు. మధురలోని జవహర్ బాగ్ వద్దనున్న 260 ఎకరాల పార్కును స్థానికులు ఆక్రమించుకున్నారు. న్యాయస్ధానం ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో తాజాగా మరోసారి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. వారిని చూసిన ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. వెంటనే ప్రతిస్పందించిన ఆందోళనకారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్పీ, సీఐ సహా 24 మంది మరణించారు.