: మోదీ విదేశీ పర్యటనలతో భారత్‌కి మరింత గుర్తింపు: విమర్శలు తిప్పికొట్టిన వెంకయ్య
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలతో దేశానికి మరింత గుర్తింపు వస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గతంలో మోదీ విదేశీ పర్యటనల నేపథ్యంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘మోదీ ఎల్లప్పుడూ విదేశాల్లోనే ఉంటారు.. అప్పుడప్పుడు భారత్‌లో పర్యటిస్తుంటారు’ అంటూ ఆయనపై నెటిజన్లు జోకులు కూడా వేశారు. తాజాగా మోదీ ఐదు దేశాల పర్యటనకు సిద్ధమవుతోన్న వేళ మరోసారి వస్తోన్న విమర్శలను వెంకయ్య తిప్పికొట్టారు. 'మోదీ ఒక అంతర్జాతీయ నేత' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తమ దేశాల్లో పర్యటించాలని ఎన్నో దేశాలు ఆహ్వానిస్తున్నాయని ఆయన చెప్పారు. విదేశాల్లో పర్యటిస్తూ ప్రపంచంలో భారత్‌కు మంచి పేరు తీసుకొస్తున్నారని వెంకయ్య అన్నారు. ప్రధాని మోదీ ఒక్క మాట చెప్పగానే ఐక్యరాజ్యసమితి ప్రపంచ యోగా డేను నిర్వహించాలని నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. ఒక ఇండియన్ 'బ్రిక్స్' బ్యాంకుకు తొలిసారి ఛైర్మన్ అయ్యాడని, మోదీ దేశానికి తెస్తోన్న మంచి పేరు వల్లే అది సాధ్యమయిందని అన్నారు. విదేశీ పర్యటనలు చేస్తూ పలు ఒప్పందాలు చేసుకుంటుండడంతో ప్రపంచంతో మంచి సత్సంబంధాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు.