: ఇప్పటికిప్పుడు వెళ్లలేం సారూ!: టక్కర్ వద్ద ఏపీ సచివాలయ ఉద్యోగుల మొర
సరైన మౌలిక వసతులు లేని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఇప్పటికిప్పుడు వెళ్లలేమని సచివాలయ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఈ మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సచివాలయ ఉద్యోగులు ఈ విషయాన్ని చెప్పారు. అక్కడ అద్దె సమస్య అధికంగా ఉందని, సచివాలయ భవన నిర్మాణం కూడా పూర్తి కాలేదని, తాము వెళ్తే, తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని ఉద్యోగులు చెప్పినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల తరలింపును ప్రస్తుతానికన్నా వాయిదా వేయాలని, భవన నిర్మాణం పూర్తయి, అన్ని వసతులూ సమకూరిన తరువాత తామే వస్తామని వారు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి సమాధానం చెబుతానని టక్కర్ వ్యాఖ్యానించినట్టు ఉద్యోగ సంఘాలు మీడియాకు వెల్లడించాయి. కాగా, ఈ నెలాఖరు నాటికి తరలింపు పూర్తి కావాలని, ఎవరి కార్యాలయం ఫర్నీచరు, ఫైళ్లను వారే అమరావతికి చేర్చుకోవాలని, అక్కడే కార్యాలయాలు ఎవరికి వారే వెతుక్కోవాలని చంద్రబాబు సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అంత త్వరగా పూర్తి కాదన్నది ఉద్యోగ సంఘాల వాదన.