: ప్రాజెక్టుల అంశంలో ఏపీ దుష్ప్రచారంపై తెలంగాణ కేబినెట్ లో చర్చ... ప్రధానిని కలవాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంపై సీఎం కేసీఆర్ నేతృత్యంలో ప్రధానిని కలవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది. సాగు, తాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అర్చకుల జీతాల చెల్లింపుపై ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వరంగల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటుకు, వరంగల్ జిల్లా మామునూరులో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సైట్వైజ్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. తెలంగాణ ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి ఆమోదం తెలిపింది.