: సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి చెప్పలేకపోతున్నాను, ఆయనో అహంకారి: పరిటాల సునీత
అనంతపురం పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా ఎంతో ప్రశాంతంగా ఉందని, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ జిల్లాలో జగన్ ఉద్రిక్తతను రేపుతున్నారని ఆమె అన్నారు. ప్రజలు రెచ్చిపోతే జగన్ తలకిందులవుతారని ఆమె అన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను తన నోటితో చెప్పలేకపోతున్నానని పరిటాల సునీత అన్నారు. జగన్ ఓ అహంకారి అని ఆమె వ్యాఖ్యానించారు. ‘జగన్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది, చంద్రబాబుపై ఆయన చేసిన మాటలు తిరిగి వెనక్కి తీసుకోవాలి’ అని ఆమె అన్నారు. ‘జగన్‌కి మతిస్థిమితం లేకుండా పోతోందేమో, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండడంతో ఆయనకు ఏదో అవుతోంది’ అని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే జనాలు వింటూ ఊరుకోరనే విషయాన్ని ఆయన గ్రహించాలని ఆమె అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన విషయం జగన్‌కు తెలియదా..? అని ఆమె ప్రశ్నించారు.