: పోలీసుల కళ్లుగప్పి రేవంత్ ఉస్మానియాలోకి ఎలా వెళ్లారంటే..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ, జనజాతర సందర్భంగా రాజకీయ నేతలెవరూ ఉస్మానియాలోకి ప్రవేశించకుండా ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ, తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వర్శిటీ లోపల ప్రత్యక్షం కావడం పోలీసు వర్గాలనే విస్మయ పరిచింది. మిగతా నేతలను విజయవంతంగా అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులకు రేవంత్ మాత్రం చిక్కలేదు. ఆయన ఓ విద్యార్థిలా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, జీన్స్ ధరించి, ద్విచక్ర వాహనంపై వర్శిటీలోకి వచ్చారు. ఉస్మానియాలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కు ఎదురుగా విద్యార్థులు దూరి వెళ్లగలిగేంత చిన్న దారి ఉండగా, అందులో నుంచి రేవంత్ వచ్చారు. ఆపై వేదిక వరకూ నడుస్తూ వెళ్లారు. వేదిక వద్ద ఆయన్ను చూడగానే విద్యార్థులు ఈలలతో హోరెత్తించగా, కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఆయన, ప్రసంగం అనంతరం వచ్చినంత రహస్యంగానే వెళ్లిపోయారు. స్టేజీకి వెనుకవైపు ముందే ఏర్పాటు చేసి ఉంచిన నల్ల కారులో ఆయన బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది.