: జూలైలో తిరుమలకు వెళ్తారా? మీ కోసం వేల సంఖ్యలో సేవా టికెట్లు
జూలైలో తిరుమలకు వెళ్లాలని భావించే శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలైలో వివిధ రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఇవన్నీ ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 56,640 టికెట్లను విడుదల చేసినట్టు ఈఓ సాంబశివరావు వెల్లడించారు. సుప్రభాత సేవకు 6,426, తోమాల సేవకు 120, అర్చన సేవకు 120, విశేషపూజకు 1,497, అష్టదళ పాదపద్మారాధన సేవకు 60, నిజపాద దర్శనం కోసం 1,859, కల్యాణోత్సవానికి 11,248, ఊంజల్ సేవకు 3,000, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 6,450, వసంతోత్సవానికి 11,610, సహస్ర దీపాలంకరణ సేవకు 14,250 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ ఉదయం అన్నమయ్య భవన్ లో 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సాంబశివరావు ఈ విషయాన్ని తెలిపారు. భక్తులతో ఫోన్లో మాట్లాడిన ఆయన, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ. 300 టికెట్లను, అద్దె గదులను 90 రోజుల ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నడక దారి భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు మరో ఆరు కంపార్టుమెంట్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సాంబశివరావు వెల్లడించారు. తిరుమల మాడవీధుల్లో గోడ ఉద్యానవనాలను పెంచుతామని తెలిపారు. టీసీఎస్ సహకారంతో టీటీడీ వెబ్ సైటును మరింత ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. తిరుమల సమాచారాన్ని ఇకపై ఆకాశవాణి మాధ్యమంగా కూడా అందిస్తామన్నారు.