: ఏపీ రాజకీయాల్లో కీలకంగా సురేశ్ ప్రభు!... నేడు హైదరాబాదుకు, రేపు బెజవాడకు!


ఏపీ కోటా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాదు వచ్చి నామినేషన్ దాఖలు చేసిన ఈ బీజేపీ నేత, నేడు మరోమారు హైదరాబాదు రానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో ఏపీ కోటాలోని నాలుగు స్థానాలకు నలుగురు బరిలో నిలిచిన కారణంగా వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేడు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆ వెనువెంటనే సురేశ్ ప్రభు హైదరాబాదులోని ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి తాను రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం అందుకుంటారు. ఆ తర్వాత ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణితో భేటీ అనంతరం ఆయన నేరుగా తిరుమల చేరుకుంటారు. తిరుమల వెంకన్న దర్శనానంతరం ఆయన తిరుపతి నుంచి రేపు ఉదయం విజయవాడ వెళతారు. అక్కడ టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడిని కలవనున్న ఆయన తనకు రాజ్యసభ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతారు. ఆ తర్వాత విజయవాడలోనే ఏర్పాటు కానున్న బీజేపీ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ మేరకు సురేశ్ ప్రభుకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ను ప్రకటించిన ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్... ఇకపై ప్రభు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పకనే చెప్పారు.

  • Loading...

More Telugu News