: మ్యాట్రిమోనీ సైట్లకు ప్రభుత్వ కండిషన్లు!
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను సంప్రదించాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. గత కొంత కాలంగా మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించేవారి నుంచి సదరు సంస్థలు నమోదు పేరిట పెద్దమొత్తంలో డబ్బులు నొక్కేసి, వారికి తప్పుడు ప్రొఫైల్స్ చూపించి, తరువాత వాళ్లు నచ్చలేదని సమాధానం చెప్పారంటూ మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, ఐటీ, మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిలువునా మోసం చేస్తున్న మ్యాట్రిమోనీ సైట్లపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాట్రిమోనీ సంస్థలు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్లో వివాహ సంబంధం అంటూ వచ్చిన వధూవరుల సమాచారంతో పాటు, వారి గుర్తింపు కార్డులు, చిరునామాకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు వాస్తవ పత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, కొంత కఠినంగా వ్యవహరించాలని, డబ్బు యావతో సడలింపులు ఇస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మ్యాట్రిమోనీ ఇచ్చే ఐపీ అడ్రస్, వివరాలు సంవత్సరం పాటు తొలగించకుండా ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ హోం పేజ్ లో కేవలం వివాహానికి సంబంధించిన ప్రకటనలే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వెబ్ సైట్ నిర్వహణలో పారదర్శకత పాటించాలని ఆయన ఆదేశించారు.