: దేదీప్యమానంగా ట్యాంక్ బండ్...హుషారెక్కిస్తున్న కళాకారులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో జంటనగరాలు వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా బాణా సంచా వెలుగులతో ట్యాంక్ బండ్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్ చుట్టూ లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాటు నుంచి సాంస్కృతిక జైత్రయాత్ర ప్రారంభించారు. ఈ జైత్రయాత్రలో భాగంగా సుమారు 500 మందికి పైగా కళాకారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఇందులో డప్పు, డోలు, గుస్సాడి, బంజారా కళాకారులు పాల్గొన్నారు. అంతేకాకుండా, లలితకళా తోరణంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి చందూలాల్ ప్రారంభించారు. కాగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.