: భార్యను హత్య చేయాలనుకున్న 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' హీరో జానీ డెప్!
ఆస్కార్ అవార్డు నామినీ, సూపర్ హిట్ హాలీవుడ్ ఫిల్మ్ సిరీస్ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' హీరో జానీ డెప్, తన భార్యను దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి అంబర్ హర్డ్ స్నేహితుడు ఒకరు వెల్లడించారు. తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ, మే 23న అంబర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ఆమె స్నేహితుడు 'న్యూయార్క్ పోస్ట్'కు ఇంటర్వ్యూ ఇస్తూ, సంచలన విషయాలు తెలిపాడు. తనను చంపాలనుకుంటున్న జానీ డెప్ ను చూసి తీవ్ర భయాందోళనకు గురైన అంబర్, తన సెల్ ఫోన్ కు మెసేజ్ పెట్టిందని, తాను వెంటనే బయలుదేరి వెళ్లగా, అప్పటికే ఆమె ముఖంపై కమిలిన గాయాలు ఉన్నాయని తెలిపాడు. ఆమె పెదవి చీరుకుపోయిందని, కొన్ని తల వెంట్రుకలు ఊడిపోయాయని, కన్నుకు గాయం అయిందని చెబుతూ, తన దీన స్థితిని చూసి చలించి పోయినట్టు వెల్లడించాడు. జానీ డెప్ తనను కొడుతూ, అవమానిస్తూ ఉండేవాడని, తన వద్దే ఉంటే విషం ఇచ్చేందుకూ వెనుకాడడని ఆమె చెప్పినట్టు వివరించాడు. కాగా, ప్రస్తుతం జానీ డెప్ పై గృహ హింస కేసు నమోదు కాగా, వీరిద్దరూ వేరువేరుగా ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.