: ఊచకోత జరిగిన 14 ఏళ్ల తరువాత గుల్బర్గ్ నరమేధం కేసు తీర్పు.. జూన్6న శిక్షలు ఖరారు.. వివరాలు
గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న గుల్బర్గ్ సొసైటీ ఊచకోత కేసును సుదీర్ఘ విచారణ జరిపి ఘర్షణలు చెలరేగిన 14 ఏళ్ల తరువాత ఈరోజు అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 24మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. జూన్6న శిక్షలు ఖరారు చేయనుంది. గుల్బర్గ్ ఊచకోత కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలోనే ఐదుగురు చనిపోయారు. మరోవ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో విచారణ ఎదుర్కుంటోన్న 66 మందిలో 24 మందిని దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం మిగిలిన 36మంది నిందితులని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఈ దాడిలో పాల్గొన్న ప్రధాన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కున్న బీజేపీ నేత బిపిన్ పటేల్ ను కోర్టు నిర్దోషిగా పేర్కొంది. గుజరాత్‌లో 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టారు. ఈ దారుణ ఘటనలో 59 మంది మరణించారు. పర్యవసానంగా ఫిబ్రవరి 28న గుల్బర్గ్ ఊచకోత సంఘటన చోటుచేసుకుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో ఒక్కసారిగా 20,000 మందిపై దాడికి దిగారు. దీంట్లో కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ తో పాటు మరో 68 మంది ప్రాణాలు ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎహసాన్ జాఫ్రీని అల్లరిమూక ఇంట్లోంచి బయటకు ఈడ్చుకుని వచ్చి చంపి, తగులబెట్టారు. జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ ఉదంతంపై 77 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ పోరాడుతున్నారు. గుల్బర్గ్ ఊచకోత కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది. 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ గతేడాది సెప్టెంబరులో పూర్తయింది. కేసుపై సుప్రీంకోర్టు గతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కూడా అనుమతినిచ్చింది. అనంతరం అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టును విచారణ జరిపి తీర్పు వెలువరించాలని గడువు విధించింది.