: ‘తలాక్’ పద్ధతిని 92 శాతం ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు: బీఎంఎంఏ
మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చివేసే పద్ధతిని వ్యతిరేకిస్తూ పలువురు ముస్లిం మహిళలు, పురుషులు సంతకాలు చేశారు. భారతీయ ముస్లిం మహిళ ఆందోళన (బీఎంఎంఏ) అనే సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని పోరాడుతోంది. ఈ నేపథ్యంలో దాఖలు చేయనున్న పిటిషన్ పై సుమారు 50 వేల మంది ముస్లిం మహిళలు, పురుషులు సంతకాలు చేశారు. ఈ పద్ధతిని నిషేధించే విషయంలో జాతీయ మహిళా కమిషన్ తమకు సాయపడాలని బీఎంఎంఏ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా బీఎంఎంఏ సహ వ్యవస్థాపకుడు జకియా సోమన్ మాట్లాడుతూ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని సంతకాలు సేకరిస్తామన్నారు. ‘తలాక్’ పద్ధతిని 92 శాతం ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారని, ఈ పద్ధతిని వ్యతిరేకించే వారిలో పురుషులు కూడా ఉన్నారని జకియా సోమన్ చెప్పారు.