: కల నెరవేరుతుంది... ఏడాదిలోగా నంద్యాల - ఎర్రగుంట్ల, పెద్దపల్లి - కరీంనగర్ - నిజామాబాద్ లైన్లు: ద.మ.రైల్వే జీఎం


తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నంద్యాల - ఎర్రగుంట్ల, పెద్దపల్లి - కరీంనగర్ - నిజామాబాద్ రైల్వే లైన్లలో ఏడాది లోగా రైళ్లు తిరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన కృష్ణా పుష్కరాల కోసం 500 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వివరించారు. గడచిన ఏడాది కాలంలో 187 కాపలాలేని రైల్వే గేట్లను తొలగించామని, 153 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని, 95 కిలోమీటర్ల డబ్లింగ్ ను పూర్తి చేశామని పేర్కొన్నారు. 2015-16లో రూ. 13,212 కోట్ల ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వే పొందిందని తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేస్తామని, ఆపై నల్గొండ జిల్లా రామగిరి వరకూ ఎంఎంటీఎస్ లు నడుస్తాయని తెలిపారు. అమరావతికి రైల్వే లైను ఎక్స్ టెన్షన్ పై సర్వే జరుగుతోందని, నాలుగైదు నెలల్లో నివేదిక కేంద్రానికి ఇస్తామని రవీంద్ర గుప్తా తెలియజేశారు.

  • Loading...

More Telugu News