: ప్లాన్ తిరగబడింది!... టీడీపీ ‘నాలుగో అభ్యర్థి’ వ్యూహం మారింది!: ‘సాక్షి’లో ఆసక్తికర కథనం


రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకున్నా నాలుగో స్థానానికి పోటీ చేయాలని ఏపీలో అధికార పార్టీ టీడీపీ భావించింది. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. మొన్నామధ్య ఆయన విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. వైెసీపీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించి తాను విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. దీనికి కాస్తంత సానుకూలంగానే స్పందించిన చంద్రబాబు... పోటీ నిర్ణయాన్ని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వదిలేశారు. నిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు హైదరాబాదులో భేటీ అయి నాలుగో అభ్యర్థిని పోటీ చేయించే అంశంపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. నాలుగో అభ్యర్థిని బరిలోకి దించే విషయంపై చంద్రబాబు విముఖంగా ఉన్నారని చెప్పిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆ మేరకు తాము కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో అసలు టీడీపీ నాలుగో అభ్యర్థి వ్యూహాన్ని ఎందుకు విరమించుకుందన్న విషయంపై కాస్తంత లోతుగా ఆరా తీసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను హైదరాబాదు నుంచి విజయవాడకు మార్పించగలిగితేనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపాలని, లేని పక్షంలో వ్యూహాన్ని విరమించుకోవాలని టీడీపీ భావించిందని ఆ కథనం పేర్కొంది. విజయవాడలో అయితే అధికార బలంతో పాటు ధన బలాన్ని చూపి వైసీపీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించే అవకాశముంటుందని, అదే తెలంగాణలో అయితే టీఆర్ఎస్ సర్కారు అధీనంలో ఉండే పోలీసుల సమక్షంలో ఈ యత్నాలు ఫలించవన్నది టీడీపీ భావనగా ఆ కథనం పేర్కొంది. ఇందులో భాగంగా పోలింగ్ ప్రదేశాన్ని మార్పించేందుకు టీడీపీ సర్కారు తనదైన శైలిలో సీరియస్ గానే యత్నించినట్లు ఆరోపించింది. ఆ కథనం ప్రకారం... ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ప్రభుత్వం లేఖ రాయించింది. హైదరాబాదులో ఏపీ కోటా రాజ్యసభ సీట్ల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పిన సత్యనారాయణ, ఎన్నికల ప్రక్రియను విజయవాడకు మార్చాలని గత నెల 24న లేఖ రాశారు. ఈ లేఖకు మొన్న (సోమవారం) కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. ఏపీ అసెంబ్లీ హైదరాబాదులో ఉండగా, విజయవాడలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన ఎన్నికల సంఘం... సత్యనారాయణ వాదనను తిరస్కరించింది. హైదరాబాదులోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మీదటే టీడీపీ తన ‘నాలుగో అభ్యర్థి’ వ్యూహాన్ని విరమించుకుందని తన కథనంలో సాక్షి పత్రిక పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సత్యనారాయణకు వచ్చిన లేఖ కాపీని కూడా ఆ పత్రిక ప్రచురించింది.

  • Loading...

More Telugu News