: టీ టీడీపీకి ‘ఆవిర్భావ’ షాక్!... సైకిల్ దిగి కారెక్కనున్న మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి!


కొత్త రాష్ట్రం తెలంగాణలో ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్ధమైంది. రేపు జరగనున్న ఈ వేడుకలకు టీఆర్ఎస్ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఆవిర్భావ వేడుకల పుణ్యమా అని టీ టీడీపీకి పెద్ద షాకే తగలనుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీపీ బలం 15 నుంచి 3కు పడిపోయింది. ఇక లోక్ సభలో తెలంగాణ నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోతోంది. గడచిన ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి విజయం సాధించారు. ఈ ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీకి పరాభవమే ఎదురైంది. అయితే టీ టీడీపీకి ఉన్న ఒక్క ఎంపీ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నిన్న మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ లో భాగంగా మల్లారెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారు. నేడు టీడీపీకి రాజీనామా చేయనున్న మల్లారెడ్డి... ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. దీంతో తెలంగాణ నుంచి లోక్ సభలో టీడీపీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది.

  • Loading...

More Telugu News