: ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు... కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల పరిధిలోని వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి రానుంది. కేంద్రం లేదా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల పేదలకు మరింతగా వైద్యసేవలందుతాయని, మెరుగైన వైద్య సేవలందించవచ్చని అన్నారు. కాగా, ప్రధాని మోదీ పరిపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూపీలోని సహరాన్ పూర్ లో ఇటీవల విజయోత్సవ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ, ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో నెలకొన్న ప్రభుత్వ వైద్యుల కొరతను అధిగమించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు మోదీ పేర్కొన్నారు.