: వివాదాస్పద మాజీ పోలీస్ బాస్ కు కొత్త పదవి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితో కొనసాగిన వివాదాస్పద మాజీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ (60) కి రిటైర్ అయిన తరువాత మరో పదవి లభించింది. బస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) లో సభ్యుడిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లు అంటే 2021 వరకు కొనసాగనున్నారు. యూపీఎస్సీలో చైర్మన్ తో పాటు పది మంది సభ్యులుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసుల ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. 1977 బ్యాచ్ కు చెందిన బస్సీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవి నుంచి రిటైర్ అయ్యారు. కేజ్రీవాల్ తో ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం ద్వారా, కన్నయ్య కుమార్ ను దేశద్రోహం కేసులో అరెస్టు చేయడంతో బస్సీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.