: యాంటీ మోదీ ట్వీట్లు... కేజ్రీపై క్రిమినల్ కేసు నమోదు అంశంపై ఫిర్యాదును కొట్టేసిన కోర్టు
యాంటీ మోదీ ట్వీట్ల అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ చేసిన ఫిర్యాదును ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఈరోజు కొట్టేసింది. కేజ్రీవాల్ ప్రధాని మోదీపై చేసిన ట్వీట్లలో ఉపయోగించిన పదాలతో ఆయనపై పరువు నష్టం, దేశద్రోహం కేసు పెట్టచ్చని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ప్రదీప్ ద్వివేది అనే న్యాయవాది సెక్షన్124ఏ, 500 కింద కేజ్రీవాల్‌పై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కేజ్రీవాల్ ట్వీట్లు చేస్తూ పిరికివాడు, మానసిక రుగ్మత ఉన్నవాడుగా మోదీని పేర్కొన్నారని, ఈ అంశం దేశంలో విద్వేషాలు పురిగొల్పేలా ఉందని ప్రదీప్ ద్వివేది కోర్టుకు తెలిపారు. అయితే ఈరోజు దీనిపై చర్చించిన కోర్టు న్యాయవాది చేసిన ఫిర్యాదును కొట్టేసింది. గత ఏడాది డిసెంబరు 15న కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించడంతో ట్విట్టర్ ద్వారా మోదీపై కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ కేజ్రీవాల్ మోదీని ‘పిరికివాడు, మానసిక రుగ్మత ఉన్నవాడు’గా పేర్కొంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌లు చేశారు.