: చిన్నపిల్లల్లా ప్రశ్నలొద్దు!: మహిళా జర్నలిస్టుకు టీజీ వెంకటేశ్ చురకలు!
టీడీపీ రాజ్యసభ అభ్యర్థి టీజీ వెంకటేశ్ ఓ తెలుగు టీవీ ఛానెల్ కు చెందిన మహిళా ప్రతినిధికి చురకలంటించారు. అప్పటిదాకా బరిలోనే లేని టీజీ వెంకటేశ్... చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి టికెట్ సాధించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు హైదరాబాదులోని అసెంబ్లీకి వచ్చిన టీజీవీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ఓ మహిళా జర్నలిస్టు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మంచి లాబీతోనే సీటు సాధించారుగా? అన్న ఆమె ప్రశ్నకు టీజీవీ వేగంగా స్పందించారు. చిన్న పిల్లల్లా ప్రశ్నలేస్తారంటూ ఆమెపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతామంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఆ మహిళా జర్నలిస్టు ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానం చెప్పిన టీజీవీ... లాబీ ప్రస్తావన రాగానే ఇక ఇంటర్వ్యూ ముగిసిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలోనూ టీజీవీ తన ముఖంలో చిరునవ్వుకు మాత్రం స్వస్తి చెప్పలేదు. నవ్వుతూనే టీజీవీ ఆమెకు చురకలంటించారు.