: చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చినా... పక్కా ప్లాన్ తో సీటు సాధించిన టీజీ వెంకటేశ్!
రాజ్యసభలో ఖాళీ కానున్న 57 సీట్లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏపీ కోటా సీట్ల అభ్యర్థుల ఖరారు విషయంలో నిన్న విజయవాడలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీ కోటాలో మొత్తం నాలుగు సీట్లుండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు సీట్లు దక్కనున్నాయి. వీటిలో ఓ సీటును మిత్రపక్షం బీజేపీకి కేటాయించేందుకు సిద్ధపడ్డ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... మిగిలిన రెండు సీట్లకు పార్టీ అభ్యర్థుల ఖరారుపై గంటల తరబడి తర్జనభర్జన చేశారు. ఈ మేరకు చర్చల కోసం పార్టీ సీనియర్లను పిలిచిన చంద్రబాబు వారితో సమావేశానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో అప్పటిదాకా అసలు రేసులోనే లేని పార్టీ నేత, మాజీ మంత్రి, రాయలసీమలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన టీజీ వెంకటేశ్ రంగప్రవేశం చేశారు. ఆర్యవైశ్య సంఘంలో కీలక నేతగా ఉన్న టీజీవీ... తన సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులను వెంటబెట్టుకుని చంద్రబాబు ఇంటి వద్ద వాలిపోయారు. పార్టీ నేతలతో భేటీకి ముందే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నోటి నుంచి కాకుండా తన వెంట వచ్చిన వారి ద్వారా తన అభ్యర్థిత్వంపై ప్రస్తావన వచ్చేలా వ్యూహం పన్నారు. ఆర్యవైశ్య వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలన్న డిమాండే కాకుండా ఇప్పటిదాకా రాజ్యసభకు వెళ్లే అవకాశం కర్నూలు జిల్లా నేతలకు రాలేదన్న విషయాన్ని ఆయన చంద్రబాబు ముందు పెట్టారు. అంతేకాక, పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచే నేతగా టీజీవీ పనిచేయనున్నారని కూడా ఆర్యవైశ్య ప్రముఖులు చంద్రబాబుకు చెప్పారు. అయితే అప్పటికప్పుడు వారికేమీ హామీ ఇవ్వని చంద్రబాబు తర్వాత చూద్దామంటూ పార్టీ నేతలతో భేటీకి వెళ్లిపోయారు. అయితే దీనిని ముందుగానే అంచనా వేసిన టీజీవీ... అటు నుంచి నరుక్కుంటూ వచ్చారు. రెండు సీట్లలో ఓ సీటును బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. బీసీకిస్తే... కర్నూలు జిల్లాకు చెందిన వాల్మీకి నేత, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిన నేత బీటీ నాయుడును ఖరారు చేయాలన్న వాదన ఉంది. ఎస్సీకిస్తే... చిత్తూరు జిల్లాకు చెందిన హేమలతకు టికెట్ ఇవ్వాలన్న వాదన వినిపించింది. అయితే వారిద్దరూ రాజ్యసభకు వెళ్లేంత స్థాయి నేతలు కాదన్న వాదనను భేటీకి హాజరైన నేతలతో టీజీవీ చెప్పించారు. బీటీ నాయుడు, హేమలతను కావాలంటే శాసన మండలికి పంపితే సరిపోతుందని పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అదే సమయంలో టీజీవీ పేరు ప్రస్తావనకు రాగానే... భేటీకి హాజరైన నేతలంతా మూకుమ్మడిగా ఓకే చెప్పేశారు. పారిశ్రామికవేత్తగా ఉన్న టీజీవీ అయితే... పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు చెప్పారు. అందరూ టీజీవీ అభ్యర్థిత్వానికి సరేననడంతో చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారు. వెరసి చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చినా పక్కా ప్లాన్ తో వచ్చిన టీజీవీ రాజ్యసభ టికెట్ ను ఎగరేసుకుపోయారు.