: కృష్ణానదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపేవరకు పోరాడతాం: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. అనంతరం రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ బిల్లుకు రాజకీయ పక్షాల మద్దతు కూడగడతామని ఆయన తెలిపారు. కేవీపీ బిల్లుకు టీడీపీ మద్దతివ్వాలని ఆయన కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యాల మీద రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపేవరకు తాము పోరాడతామని చెప్పారు. 2019 ఎన్నికలతో టీడీపీ ఆయుష్షు అయిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నెలాఖరున లేదా జులై మొదటి వారంలో తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. పార్టీని బలపరుస్తూనే ప్రజా సమస్యలపై పోరాడతామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.