: నెటిజన్ల శాపనార్థాలు తట్టుకోలేకే నా ఫొటోలు డిలీట్ చేశాను: టీవీ నటి సోనారికా భడోరియా
‘దేవోన్ కా దేవ్ మహదేవ్’ అనే హిందీ సీరియల్ లో పార్వతి దేవి పాత్రలో నటించిన సోనారికా భడోరియా గుర్తుండే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకొని కూడా మూడేళ్లవుతోంది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమెను పార్వతీ దేవీ పాత్రలోనే గుర్తుంచుకున్నారు. ఇటీవల సోనారికా భడోరియా విహార యాత్రకు వెళ్లింది. అక్కడి బీచ్ లో బికినీలతో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సోనారికా పోస్టు చేసింది. అంతే, విమర్శలు, శాపనార్థాలు గుప్పిస్తూ నెటిజన్లు మండిపడ్డారు. పార్వతీదేవి పాత్రలో నటించి...ఇప్పుడు బికినీలు వేసుకున్న ఫొటోలు పోస్టు చేస్తారా? అంటూ ఆగ్రహించారు. నెటిజన్ల గోల భరించలేకపోయిన సోనారికా ఎట్టకేలకు తన ఫొటోలను డిలీట్ చేసింది. నెటిజన్ల విమర్శలు తట్టకునేంత శక్తి తనకు లేదని, అందుకే డిలీట్ చేస్తున్నానంటూ సోనారికా చెప్పింది. అన్నట్టు, ఈ చిన్నది తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం... వంటి సినిమాలలో కూడా నటించింది.